Friday, 3 June 2016

ప్రజల్లోకి మరింతగా వెళ్లాలి!

 హైదరాబాద్‌: ‘‘రెండేళ్లలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివీ చేశాం. ఈ ఏడాది నుంచి కొత్తగా పథకాలు ప్రకటించడానికి ఏముంటాయి? ఇక ముందు కొత్తదనమేమీ ఉండదు. చేయాల్సిందల్లా మొదలుపెట్టిన పథకాలను అద్భుతంగా అమలు చేయడమే. మంత్రులంతా హైదరాబాద్‌లో తక్కువగా, గ్రామాల్లో ఎక్కువగా ఉండాలి.. ప్రజల్లోకి బాగా వెళ్లాలి..’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఆయన ఈ సూచనలు చేసినట్లు తెలిసింది.

ఎలాంటి తొట్రుపాటు లేకుండా రెండేళ్లు పనిచేశామని, వచ్చే మూడేళ్లు బాగా పనిచేయాలని పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే మూడేళ్లలో రెండేళ్లు కీలకమని, తర్వాత ఏడాదంతా ఎన్నికల హడావుడి ఉంటుంది కాబట్టి సమయాన్ని బాగా వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లాల విభజనపైనా చర్చ!
జిల్లాల విభజన అంశంపైనా సీఎం మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా జిల్లా పేరొకటి, జిల్లా కేంద్రంగా ఉండే పట్టణం మరొకటి ఉన్న చోట మార్చాలని అభిప్రాయం వ్యక్తమైంది. కొత్త జిల్లాల కేంద్రాల విషయంలోనూ చర్చించారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కొందరు మంత్రులు నామ్‌కే వాస్తేగా వెళ్లి వస్తున్నారని, అది సరికాదని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. జిల్లాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, జిల్లాకు ఏం కావాలో తెలుసుకోవాలని, అభివృద్ధి కోసం సీఎంని ఏం అడగాలో స్పష్టత ఉండాలని సూచించారని తెలిసింది. పార్టీ నాయకులు, శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని తెలుస్తోంది.

అయితే ఈ విషయం తనకు వదిలేయాలని, అన్నీ సర్దుకుంటాయని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. గత కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయించాలని, అధికారులను పిలిపించి మాట్లాడాలని సూచించారని తెలిసింది. శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న మంత్రి హరీశ్‌రావుకు సహచర మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

No comments:

Post a Comment