Friday, 3 June 2016

టీఎస్ పోలీస్.. సూపర్ పోలీస్...

 -ఇటు శాంతిభద్రతలు.. అటు ప్రజాసేవలోనూ జిల్లా పోలీసులు
-నూతన వాహనాలు.. పెరిగిన వేతనాలతో ఆనందోత్సాహాలు 
-తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖకు పెద్దపీట వేసిన ప్రభుత్వం
-మిషన్ కాకతీయ, హరితహారంలోనూ జిల్లా పోలీస్‌శాఖ ముందంజ..
ఖమ్మం క్రైం: భద్రతల పరిరక్షణకు ఆహర్నిశలు శ్రమించే పోలీసులకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖకు పెద్దపీట వేశారు. పోలీస్ సిబ్బంది సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వారి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రణాళికలను రూపొందించి నూతన మార్పులకు శ్రీకారం చుట్టారు. కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తూ.. పనితీరు మెరుగుపడే విధంగా ప్రణాళిక రూపొందించారు. పోలీస్ సిబ్బందికి 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు పెంచి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలోనూ పోలీస్ సిబ్బందికి 10శాతం వాటా కల్పించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో సుమారు 4వేల మంది పోలీసులు, పదకొండు వందల మందికి పైగా హోంగార్డులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సత్ఫలితాలను ఇచ్చిన పీపుల్స్ ప్రెండ్లీ పోలీసింగ్.. 
పోలీస్‌శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ సర్కార్ పీపుల్స్ ప్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి అందులో మహిళా సిబ్బందికి విధులు కేటాయించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో పోలీసు సిబ్బంది నడుచుకోవాల్సిన పద్ధతులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగివుండే విధంగా ప్రజా సమస్యలపై పోలీసులు సత్వరమే స్పందించేలా పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై జిల్లా పోలీస్ బాస్ షాన్వాజ్‌ఖాసీం ప్రత్యేక దృష్టి సారించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడంలో సఫలికృతమయ్యారు. వారంలో 3 రోజులు పోలీస్ అధికారులు గ్రామాలలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా చేపడుతున్న చర్యలు ప్రజలు పోలీసులకు దగ్గరయ్యేలా చేస్తున్నాయి. 

ప్రజా సమస్యలపై పోలీసులు స్పందిస్తున్న తీరు, కేసుల దర్యాప్తుల్లో పురోగతి, బాధితుల ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరపడం, బాధితులకు న్యాయం చేయడంలో జిల్లా ఎస్పీ షాన్వాజ్‌ఖాసీం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పెరిగిన జీతాలతో పోలీస్ ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు.. 
గత ప్రభుత్వాల్లో అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతూవస్తున్న పోలీస్‌శాఖ ఉద్యోగులు కేసీఆర్ పాలనలో పెరిగిన వేతనాలతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి నుంచి పై స్థాయి అధికారి వరకు వేతనాలు పెరగడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం తెలుసుకుని వారికి వేతనాలను 43శాతం ఫిట్‌మెంట్‌తో పెంచి గత ఏడాది నుంచి అమల చేస్తున్నారు.

హోంగార్డులకు 12వేలు.. 
పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను గత ప్రభుత్వాలు వెట్టిచాకిరియే చేయించాయి. చాలీచాలని జీతంతో కుటుంబపోషణ భారమై హోంగార్డులు తమ జీతాలు పెంచాలని అప్పట్లో గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు నివేదించినా ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని మినీ పోలీసులుగా గుర్తిస్తామన్నారు. హోంగార్డులకు నెలకు రూ. 12వేల వేతనం అందేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో పదకొండు వందల మందికి పైగా హోంగార్డులు లబ్ధిపొందుతున్నారు. బస్‌పాస్ సౌకర్యం, భద్రత, వారంలో ఒకరోజు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం అందేవిధంగా చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లా హోంగార్డులు ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

పోలీసులకు నూతన వాహనాలు.. 
కాలం తీరిన వాహనాలతో ఇబ్బందులకు గురవుతున్న పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన వాహనాలు కొనుగోలు చేసి అందించింది.పెట్రోలింగ్, వీవీఐపీల బందోబస్తు కోసం వాహనాలు సరిపోకపోవడం, వాహనాలు మొరాయించడంతో ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు స్థలానికి వెళ్లాలంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోయేది. ఇలాంటి పరిస్థితులపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖకు నూతన వాహనాలను అందజేసింది. జిల్లాలో 59 పోలీస్ స్టేషన్‌లకు ఒక నూతన సుమో వాహనం, ఒక నూతన మోటారు సైకిల్‌ను కేటాయించింది. వీవీఐపీల బందోబస్తు, సీఎం, గవర్నర్ పర్యటనలకు ఉపయోగించుకునేందుకు జిల్లాకు అనేక నూతన వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు 60 సుమో గోల్డ్ వాహనాలు, వీవీఐపీల భద్రత కోసం బుల్లెట్‌ప్రూఫ్ ఫార్చునర్ వాహనాలు రెండు, ఐచర్ బస్సులు రెండు, ఐచర్ వ్యాన్లు నాలుగు, టూ వీలర్స్ 75, నాలుగు బుల్లెట్ వాహనాలు, ఫోర్స్ ట్రావెలర్ ఏసీ బస్సును ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. 

మిషన్ కాకతీయలోనూ జిల్లా పోలీసుల ముందంజ...
శాంతి భద్రతల పరిరక్షణలో తనమునకలైన జిల్లా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారంలోనూ ముందంజలో ఉండి ప్రజాసేవలో జిల్లా పోలీసులు భేష్ అనిపించుకున్నారు. జిల్లా పోలీస్‌బాస్ షాన్వాజ్‌ఖాసీం స్వయంగా పలుగు, పార పట్టి సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. పోలీస్‌శాఖ తరుపున జిల్లాలో కొణిజర్ల మండలం అమ్మపాలెం చవిటి చెరువును, కొత్తగూడెంలో ఓ చెరువును, తిరుమలాయపాలెం మండలంలో ఒక చెరువును దత్తత తీసుకుని చెరువులు పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మిషన్ కాకతీయలో పోలీస్ అధికారులు, సిబ్బంది ముందుకు నడుస్తూ.. ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. విధుల్లో క్షణం తీరికలేకుండా ఉండే పోలీస్ అధికారులు ప్రజా సేవలలో భాగస్వామ్యులై మిషన్ కాకతీయలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

పోలీసుల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం.. 
పోలీసుశాఖా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో పోలీసుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏళ్ళ తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వంలో పరిష్కారమయ్యాయి. వేతనాల పెంపు, సిబ్బంది ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు తదితర సమస్యలకు పరిష్కారాలు లభించాయి. పోలీస్‌శాఖ సిబ్బందికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 
-జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు

No comments:

Post a Comment