Friday, 3 June 2016

సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..

  కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిరంతరం పనిచేసి విజయశిఖరాలు అధిరోహించే దిశగా పాటుపడాలని సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లోని 11 ఏరియాల స్థాయి సెంట్రల్ రాష్ట్ర అవతరణ వేడుకలు గురువారం కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. తొలుత సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద సీఎండీ ఎన్.శ్రీధర్ తెలంగాణ రన్‌ను ప్రారంభించారు. ఈ రన్‌లో ఆయన పాల్గొని బస్టాండ్ సెంటర్ వరకు చేరుకొని అక్కడ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత సింగరేణి ఎస్‌అంఢ్‌పీసీ, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు సింగరేణి డాగ్‌స్కాడ్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసి, ఉత్తమ ఉద్యోగులను, కార్మికులను సన్మానించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంత పోరాటాలు చేసి అమరులైన వారందరికీ జోహార్లు అర్పిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం దేశంలో జరిగిన అన్ని పోరాటాల కంటే పూర్తి భిన్నమైందన్నారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి బంగారుతెలంగాణగా రుపుదిద్దినప్పుడే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా వాస్తవ రూపంలోకి రావాలంటే ప్రతీ పరిశ్రమ, ఉద్యోగి, కార్మికుడు, పౌరుడు తమవంతు బాధ్యత వహించాలన్నారు. సీఎం కేసీఆర్ అనేక సమీక్షలలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పనిచేసింది వేరు.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పనిచేయాల్సిన పద్దతి వేరు.. మనమంతా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ దృక్పదంతో పథకాలు తయారు చేయాలి.. అమలు చేయాలి.. లక్ష్యాలు సాధించాలి అని చెప్తుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ తమ పనివిధానాలను మార్చుకుంటున్నాయని, కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయని, 2015 జనవరిలో సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తనకు సింగరేణిని బొగ్గు వనరుగా మార్చాలి, దేశంలోనే నంబర్‌వన్‌గా చేయాలి, రాష్ట్రంలో నిర్మించుకున్న విద్యుత్ పరిశ్రమలకు తగినంత బొగ్గు ఇచ్చే స్థాయికి చేర్చాలని సీఎం కేసీఆర్ దిశ, నిర్దేశం చేశారన్నారు. ఆయన ఆకాంక్షను నిజం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అవసరాల రిత్యా 600 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందరి సమష్టి కృషితో లక్ష్యాన్ని సాధించి పదిహేను శాతం వృద్ధి రేటుతో నిలిచి సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు సింగరేణిని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపామన్నారు. తెలంగాణ శక్తిసామర్థ్యాలు ఏమిటో దేశానికి చాటిచెప్పామన్నారు. 2016-17 సంవత్సరంలో నిర్దేశించుకున్న 660 లక్షల టన్నుల ఉత్పత్తిని కూడా సాధించి తీరాలన్నారు. ఇందుకు మనమంతా కష్టపడి అంకితభావంతో పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్‌వన్‌గా దూసుకుపోతోందని, దేశ, విదేశీ పరిశ్రమలు రానున్నాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ లాంటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం మణుగూరు, దామరచర్లలో కొత్తగా విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పుతోందని, వీటన్నింటికి తగినంత బొగ్గును అందించడానికి మనకున్న అవకాశం మేరకు కృషి చేయాలన్నారు.

ఎస్‌టీపీపీలో 1200మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్దమైందని, ఈ పవర్‌ప్లాంట్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకునే శుభతరుణం రానుందన్నారు. కార్మికుల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అందరికీ యోగా, స్టాప్ డయాబెటీస్, సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు, మహిళల కోసం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాలు, ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, క్వార్టర్ల రిపేర్లు, స్విమ్మింగ్ పూల్స్ కోసం మీ కోసం - మీ చెంతకు పేరుతో వెయ్యికి పైగా పనులు చేశామన్నారు. నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి 11 వేల మందికి ప్రైవేటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ అవతరించిన తరువాత రాష్ట్రంలోనే కొత్తగా సుమారు ఐదు వేల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించిన ఏకైక పరిశ్రమగా ప్రత్యేకతను నిరూపించుకుందన్నారు. రానున్న ఐదేళ్లలో సింగరేణిలో 28 కొత్త బొగ్గుగనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధ్దం చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పారిశ్రామిక సంబంధాల గుర్తింపుగా బెస్ట్ మేనేజ్‌మెంట్, ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇన్ కాస్ట్‌మేనేజ్‌మెంట్ అవార్డులను కూడా అందుకోవడం సింగరేణిలో తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించినైట్లెందన్నారు.

సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకారం మన పనివిధానంలో మార్పులు రావాలి, పాత తరహా అలసత్వం పోవాలి, మన తెలంగాణ మన రాష్ట్రం మన ప్రగతి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. అప్పుడే మనం ముందుకు దూసుకుపోగలమన్నారు. సింగరేణి డైరెక్టర్‌లు జే.పవిత్రన్‌కుమార్, బీ.రమేష్‌కుమార్, ఏ.మనోహర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ఐఎన్‌టీయూసీ నుంచి బీ.వెంకట్రావ్, ఏఐటీయూసీ నుంచి గట్టయ్య, హెచ్‌ఎంఎస్ నుంచి రియాజ్ అహ్మద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment