Friday, 3 June 2016

ఇక గరుడా పరుగులు

  మ్మం డిపోకు చేరుకున్న బస్సులు
-రూ. 2.40 కోట్లతో ఏర్పాటు
కమాన్‌బజార్, జూన్1 : కాలం చెల్లిన బస్సులతో ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గరుడా బస్సులు ఖమ్మం రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఖమ్మం రీజియన్‌కు రెండు గరుడా బస్సులు మంజూరయ్యాయి. నూతన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన నూతన గరుడా బస్సులు ఖమ్మం డిపోకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఖమ్మం- బెంగుళూరుకు ఇంద్రబస్సులలోనే ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. కానీ వీటి స్థానంలో గరుడా బస్సులు తిరగనున్నాయి. ఒక్కొక్క బస్సు రూ. 1.20 కోట్ల చొప్పున రెండు బస్సులకు రూ. 2.40 కోట్లను కేటాయించింది. ఖమ్మం డిపోకు వచ్చిన రెండు గరుడా బస్సులను ప్రస్తుతం ఖమ్మం- బెంగుళూరుకు తిరుగుతున్న ఇంధ్రబస్సుల స్థానంలో ఈ గరుడా బస్సులను తిప్పేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సుల యొక్క పర్మిట్, రిజిస్ట్రేషన్ పనులు ఒక వారం రోజుల్లో పూర్తి కాగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన గరుడా బస్సులతో ప్రయాణికులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


నూతన టెక్నాలజీతో గరుడా బస్సులు...
ఖమ్మం రీజియన్‌కు మంజూరైన గరుడా బస్సులు నూతన టెక్నాలజీతో ప్రయాణికుల ముందుకు రాబోతుంది. ఈ బస్సు నూతన డిజైన్‌ను వోల్వో కంపెనీ రూపొందించింది. ఈ బస్సుకు క్లచ్ లేకుండా నడుస్తుంది. బ్రేక్, ఎక్స్‌లేటర్ ద్వారానే బస్సు డ్రైవర్ నడిపేందుకు రూపొందించారు. బస్సు లోపల విశాలమైన సీట్లను నిర్మించారు. ప్రయాణికులకు వీలుగా బస్సు బాడీ డిజైనింగ్ చేశారు. బస్సు లోపల మూడు కెమెరాలను అమర్చారు. ఒక కెమెరా బస్సు రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుకభాగం కన్పించే విధంగా అమర్చారు.

ఆ కెమెరా ద్వారా డ్రైవర్ వద్ద ఉన్న ఎల్‌సీడీలో పూర్తిగా వెనుకభాగం కన్పిస్తుంది. తద్వారా డ్రైవర్ ఎవరి సహాయం లేకుండా బస్సును వెనక్కి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుంది. రెండవ కెమెరా బస్సు ముందుభాగాన కుడివైపు, మూడవ కెమెరా బస్సు ముందు భాగాన ఎడమ వైపు అమర్చారు. ఈ కెమెరాతో ప్రయాణికులు ఎవరెవరు ఎక్కారో పూర్తి రికార్డింగ్ అవుతుంది. మార్గ మధ్యలో డ్రైవర్ ఏ ప్రదేశాల్ల్లో ఆపాడో పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. డ్రైవర్‌కు వీలుగా ఉండేందుకు డిజిటల్ డయాస్ బోర్డులను ఏర్పాటు చేశారు. 

ఈ డయాస్ బోర్డులో ఏ డోరు లాక్ సరిగా పడకపోయిన బస్సు ముందుకు కదలదు. ఏ డోర్ పడలేదో డయాస్ బోర్డులో డ్రైవర్‌కు చూపిస్తుంది. ప్రయాణంలో ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు బయటకు రావడానికి వెనుక భాగాన కుడి వైపు ఎమర్జెన్సీ డోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్సులో 47 సీట్లను అమర్చారు. ప్రయాణికులు తమ ప్రయాణంలో నిద్రపోయే విధంగా సీట్లను ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. బస్సు స్పీడ్‌లో ఉన్నప్పుడు గుంటలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మల్టీ యాక్సిల్‌తో రూపొందించారు. ఈబస్సులో 8 అగ్నిమాపక సిలిండర్లను ఏర్పాటు చేశారు. బస్సు అడుగు భాగాన విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణికులు తమ లగేజీలను భద్రపరిచేందుకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. బస్సులో వెనుక భాగాన కూర్చున్న ప్రయాణికులకు ముందు భాగాన ఉన్న టీవీ చూసేందుకు ఇబ్బందులు పడకుండా మధ్య భాగంలో కూడా టీవీని ఏర్పాటు చేశారు. 

ఈ టీవీలు ఎల్‌సీడీ టెక్నాలజీతో రూపొందించారు. ఈ బస్సులో హైటెక్నాలజీ హెయిర్ కండీషన్ ఉండటం వల్ల బస్సు ఇంజన్ స్టార్ట్ చేయగానే 10 నిమిషాల్లో బస్సులోపల పూర్తిగా చల్లబడుతుంది. ప్రయాణికులకు బస్సులు ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయో తెలియజేసేందుకు బస్సు ముందు భాగంలో ఎల్‌సీడీని రూపొందించారు. అందులో బస్సు బయలుదేరే ప్రాంతం నుంచి గమ్య స్థలం చేరే వరకు ఆ రూట్‌లో ఉన్న ఊర్ల పేర్లను ఎల్‌సీడీ ద్వారా ప్రయాణికులకు కన్పించే విధంగా ప్రదర్శిస్తుంది. ప్రయాణికులు బస్సులో ఎక్కేందుకు రెండు విశాలమైన డోర్లను ఏర్పాటు చేశారు. 

బస్సులు నడిపే డ్రైవర్లకు శిక్షణ...
నూతనంగా మంజూరైన గరుడా బస్సులను నడిపేందుకు నైపుణ్యం గల 10 మంది డ్రైవర్లను ఆర్టీసీ అధికారులు ఎంపిక చేశారు. ఆ డ్రైవర్లను బెంగుళూరులో వోల్వో కంపెనీ వారిచే శిక్షణ పొందేందుకు పంపించారు. వారు పూర్తి శిక్షణ తీసుకుని వచ్చారు. ఈ గరుడా బస్సులను నడిపేందుకు విద్యార్హతలు 10వ తరగతి వరకు ఉండాలి. 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ బస్సులు నడిపేందుకు అర్హులు కాదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే శిక్షణను పొందిన డ్రైవర్లకు బస్సుల యొక్క ప్రాముఖ్యతను, వాటి యొక్క సామర్థ్యాన్ని రీజియన్ డ్రైవర్ పలు సూచనలు చేస్తున్నారు. ఈ బస్సులను రిపేర్ చేసే మెకానిక్‌లకు కూడా శిక్షణను అందించారు. ఈ గరుడా బస్సులకు ప్రత్యేకంగా డిపోలలో గ్యారేజ్‌ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఈ బస్సులు మంజూరు చేయడం పట్ల ప్రయాణికులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment