Saturday, 4 June 2016

రియల్ మొక్కలు..!

కూసుమంచి, నమస్తేతెలంగాణ:మీరు ప్లాట్‌కు పెట్టిన సొమ్మును మూడు, నాలుగు సంవత్సరాలల్లో మీకు తిరిగి ఇచ్చే బాధ్యత మాది..! అంటే మీకు ప్లాట్ ఉచితంగా వచ్చినట్లే..! అదెలాగ అంటారా..? మీరు కొనుగోలు చేసిన ప్లాట్‌లో అత్యంత ఖరీదైన మొక్కలు పెంచుతాం.. మొక్కలు చెట్లుగా మారి, వాటి కలపను విక్రయించే వరకు బాధ్యత కూడా మాదే..! మూడు, నాలుగేళ్లలో 
కలపను విక్రయించగా వచ్చే సొమ్ము మాత్రం మీదే..! అధికారుల నుంచి అన్ని అనుమతులున్నాయి. 
రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఢోకా లేదు 
రియల్టర్లు కొనుగోలుదారులకు చెప్పే మాటలు..!
రియల్ వ్యాపారం చేయడం లేదండి..! 
వ్యవసాయం సాగు చేస్తున్నాం. ఖరీదైన చెట్లను పెంచుతున్నాం. మరో ఐదేళ్ల తర్వాత రియల్ 
వ్యాపారంలో అడుగు పెడదామనుకుంటున్నాం. మాకు కన్వర్షన్, లేఔట్ అవసరం లేదు. ఐదేళ్ల తర్వాత అన్ని అనుమతులు తీసుకుంటాం 
ఇది రియల్ వ్యాపారులు అధికారులకు 
చెప్పే మాటలు..!!
ఇంతకీ రియల్ మొక్కల మాటున ఉన్న కథేంటి అనుకుంటున్నారా..? ఐతే 7వ పేజీలోకి రండి..!

మీరు ప్లాట్ కొంటే చాలు.. డబ్బులు సంపాదించిపెట్టే బాధ్యత మాదే.. మీ ప్లాట్లలో అత్యంత ఖరీదైన మొక్కలను పెంచుతాం. అవి మూడు, నాలుగేళ్లలో చెట్లుగా పెరిగి విక్రయించుకునేందుకు వీలుంటుంది. కలపను విక్రయించే బాధ్యత కూడా మాదే.. వచ్చే డబ్బులు మాత్రం మీకు. ప్లాట్‌కు అన్ని అనుమతులున్నాయి. మీకు భయమే లేదు. కన్వర్షన్, లేఔట్, ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాం. పక్కా రిజిస్ట్రేషన్. ఇంత మంచి ఆఫర్ ఎక్కడా దొరకదు.. ఇదీ రియల్ వ్యాపారులు కస్టమర్లకు చెప్పే మాటలు. 

వాస్తవంగా చూడబోతే పంట చేల్లో మొక్కలు పెంచుతున్నట్లు కనిపిస్తుంది. కానీ జరిగేది పక్కా రియల్ వ్యాపారం. మొక్కలు పెంచుతూనే అందులోనే ప్లాట్లుగా విభజించి, మ్యాప్ ద్వారా ప్లాట్లను విక్రయిస్తున్నారు. కస్టమర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ.. హౌసింగ్‌కు పనికిరాని భూములను ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

కూసుమంచి, నమస్తేతెలంగాణ: కూసుమంచి మండలంలో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఖమ్మం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో మండ లం ఉండటం, ఇరువైపులా నాలుగులైన్ల రహదారి మంజూరు కావడం, సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా మార్చడంలో రియల్ వ్యాపారం పరుగులు తీస్తోంది. మండలంలో ఒకటి, రెండు వెంచర్లకు మినహా లేఔట్, టౌన్‌ప్లానింగ్ అనుమతులు లేకుండా, పంచాయతీలకు పన్నులు చెల్లించకుండానే అనేక గ్రామాల్లో వెంచర్లు వేసిన రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. 

మొక్కల మాటున మాఫియా..
ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా రియల్ వ్యాపారంలో మార్పులు చేస్తున్నారు. భూములు కొనుగోలు చేసి, రోడ్లు వేసి, లైట్లు పెట్టి అందంగా తీర్చిదిద్దినప్పటికీ ప్రజలు భూముల కొనుగోలు విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ వ్యాపారులు న్యూ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. ప్లాట్ కొంటే మూడేళ్లలో మీ డబ్బు, మీ ప్లాటు మీకే సొంతం అంటూ ప్రచారం చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అక్కడ మొక్కలను పెంచుతూ, అందులోనే వెంచర్లు వేసి, ప్లాట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. మొక్కలు వేసే నాటి నుంచి పెంచి, విక్రయాలు చేసేంత వరకు తమదే బాధ్యత అంటూ ప్రజలను నమ్మిస్తున్నారు. 

అయితే మొక్కలు పెరగడం, వాటిని విక్రయించడం, ఎంత డబ్బు వస్తుందో తెల్వదు కానీ.. రియల్ వ్యాపారులు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రాళ్లు వెనకేసుకున్న ఉద్యోగులు రియల్ వ్యాపారుల ఉచ్చులో పడుతున్నారనే విమ్మర్శలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ ఆదాయానికి గండి..
కూసుమంచి మండలంలోని పది గ్రామాల్లో సుమారు 20 వరకు కన్వర్షన్, లేఔట్, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా వెంచర్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి, రెండు మినహా ఏ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా మొక్కల పెంపకం మాటున రియల్ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా కూసుమంచి నుంచి జక్కేపల్లి రోడ్డులో, కూసుమంచి నుంచి నేలకొండపల్లి రోడ్డులో, ఖమ్మం టూ సూర్యపేట రహదారుల్లో ఇలాంటి రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా మల్బరి వేపల పెంపకం జోరుగా సాగుతోంది.

పంచాయతీ, రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తే పంట భూమిలో మొక్కలు పెంచుకుంటున్నాము అని సమాదానమిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ రెవెన్యూ అధికారిని, పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరి తే పై విధంగా స్పందించారు. మొక్కల మాటున రియల్ వ్యాపారులు పంచాయతీలకు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియల్ వ్యాపారుల ఆటలకు బ్రేక్‌లు వేయాలని మండల ప్రజలకు కోరుతున్నారు. 
అనుమతులు లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తే తిప్పలే..

రూ. లక్షలతో అనుమతులు లేకుండా ప్లాట్లను కొనుగోలు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముంది. తిరిగి ప్లాట్‌ను విక్రయించేందుకు, బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒక్క ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురికి విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందనే చెప్పాలి. ప్రస్తుతం రియల్ వ్యాపారులు వారే లేఔట్ వెంచర్ ప్లానింగ్ కాపీని కంప్యూటర్‌లో తీసి, ప్రజలకు చూపిస్తున్నారు. 

తద్వారా కొనుగోలు చేసే ప్రజలు నష్టపోయే అవకాశముంది. పంచాయతీ పన్ను చెల్లించకపోవడం వల్ల వీధిలైట్లు, ఇంటిపన్నులు, ఇంటినంబర్ తదితర అవకాశాలు ఉండవు. ఇలా అనుమతులు లేకపోతే అనేక ప్రమాదాలు ఉంటాయని టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా అనుమతులు లేని వెంచర్లపై కొరడా జులిపిస్తారా.. వేచి చూడాల్సిందే..? 

అనుమతులు లేని ప్లాట్లు కొనద్దు..
ల్యాండ్ కన్వర్షింగ్, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అనుమతులతో వెంచర్ వేసుకోవాలి. పంట భూముల్లో వెంచ ర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తే ఊరుకునేది లేదు. చర్యలు తీసుకుంటాం. ప్రజలు ప్లాట్లు కొనుగో లు చేసే ముందు అన్ని అనుమతులున్నాయా.. లేదా.. చూసుకోవాలి. అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలి. లేకపోతే కొనుగోలు చేసినా ఫలితం ఉండదు.
-లక్కినేని కిషోర్‌కుమార్, 

తహసీల్దార్, కూసుమంచిఅనుమతులు లేకుంటే చర్యలు..
మండలంలో అనుమతులు లేని వెంచర్లు వేసి, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు మాకు తెల్వ దు. మొక్కలు పెంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అం దులో ప్లాట్లు చేసి విక్రయిస్తే కచ్చితంగా పంచాయతీ అనుమతి తీసుకోవాల్సిందే. పన్ను చెల్లించాల్సిందే. లేకపోతే వ్యాపారులపై చర్యలు తప్ప వు. -విద్యాచందన, ఎంపీడీవో, కూసుమంచి

No comments:

Post a Comment