Wednesday, 1 June 2016

సంబురాలకు సర్వం సిద్ధం..

పల్లె నుంచి పట్నం వరకూ ఆవిర్భావ వేడుకలు..
-ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
-నలుగురు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం..
-25 విభాగాల్లో అవార్డుల అందజేత
-విద్యుత్ వెలుగుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు
-జిల్లా మంత్రి చేతుల మీదుగా పలువురికి సన్మానం
ఖమ్మం ;రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అన్నివర్గాల ప్రజలను రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. పల్లెనుంచి పట్నం పండుగ వాతావరణంలో వేడుకలు ఒకరోజు ముందే తెలంగాణ ఆవిర్భావ సంబురాలు ప్రారంభం అయ్యాయి.ప్రభుత్వ,సంస్థల ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 


సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలోని ఏడుగురు అమరవీరుల కుటుంబాలలో నలుగురు అమరవీరుల కుటుంబాలకు ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీరికి నేడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందించనున్నారు. ప్రభుత్వ జాతీయ జెండా ఎగురనుంది. అన్ని కార్యాలయాలు, మార్కెట్ యార్డులు సొసైటీల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు చేసి అమరవీరులకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు.. 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 విభాగాల్లో ప్రతిభ వారికి అవార్డులను అందించనున్నారు. రైతు, ఉత్తమ టీచర్, ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త, ఉత్తమ సోషల్ వర్కర్, ఉత్తమ వైద్యుడు, ఉత్తమ స్వచ్ఛంద సంస్థ, ఉత్తమ క్రీడాకారుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ ఆర్టిస్ట్, ఉత్తమ వేదపండితుడు, ఉత్తమ లాయర్, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి, ఉత్తమ మండలం, ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ గ్రామపంచాయతీ, ఉత్తమ శాస్త్రవేత్త, ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు అవార్డులను అందించనున్నారు. మరో 5 విభాగాల్లో అవార్డులను అందజేస్తారు. ఒక్కొక్కరికి ప్రశంసాపత్రంతో పాటు రూ. 51,116లను అందించనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ అవార్డులను అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

నేటి కార్యక్రమాలు.. 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఇల్లెందు రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 8 గంటలకు ఆటోర్యాలీని నిర్వహించనున్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అర్పిస్తారు. 9 గంటలకు గ్రౌండ్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. 

నగదు అవార్డులను, మెరిట్ సర్టిఫికెట్లను మంత్రి అందజేస్తారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. వీటికి సంబంధించి పోలీసు, డీఆర్‌డీఏ, డీఆర్‌ఓ ఏర్పాట్లను చేస్తున్నారు. 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నగరంలోని టీటీడీసీ భవన్‌లో కవి సమ్మేళనం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు నగరంలోని స్టేడియంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి పెవిలియన్‌గ్రౌండ్ వరకు అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తారు.

ప్రత్యేక కార్యక్రమాలు.. 
జిల్లావ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలలో దుస్తులు, పండ్లు, పంపిణీ చేయనున్నారు. అంధుల పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులను అందజేస్తారు. కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.మెడికల్ క్యాంప్‌లను నిర్వహించి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు అందిస్తారు. మధ్యాహ్న భోజన పథకంలో నాన్‌వెజ్ ఆహారాన్ని అందించనున్నారు. 

సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు స్వీట్లు, నాన్‌వెజ్ మున్సిపాలిటీలో 50కేజీల స్వీట్‌ను పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.ప్రతీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేస్తారు. తొలి తెలంగాణ ఉద్యమంలో, 2001 నుంచి జరిగిన ఉద్యమంలో జరిగిన ప్రధాన ఘట్టాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. హాళ్లలో తెలంగాణ అందాలను చూపిస్తున్నారు. సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, క్రీడలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను వివరిస్తూ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment