Friday, 3 June 2016

రానున్న మూడేళ్లలో రెట్టింపు అభివృద్ధికి కృషి..

-అమరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
-తెలంగాణ ఉద్యమంలో జిల్లావాసులది క్రియాశీలక పాత్ర
-సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శం
-సీఎం కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ దిశగా పయనం
-రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాల అందజేత
-వివిధ రంగాలలో నిష్ణాతులైన 28 మందికి ప్రశంసా పత్రాలు..
ఖమ్మం ప్రతినిధి, ;ఉద్యమగుమ్మం ఖమ్మంజిల్లాలో గడిచిన రెండు సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, రానున్న మూడేళ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో జిల్లా అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో జిల్లావాసులు క్రియాశీలక పాత్ర పోషించారని, తొలి, మలి దశల్లో సకలజనులు ఒక్కటై ముందుకు కదిలారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దేశ ప్రధానితో పాటు ఎంతో మంది ప్రముఖులు ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకపత్రాలు మంత్రి అందజేశారు.

గడిచిన రెండు సంవత్సరాల్లో జిల్లాలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, అదే స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓవైపు ఉద్యమ ఘట్టాలను నెమరవేసుకుంటూనే మరోవైపు మనం పయనించాల్సిన కాలానికి సంబంధించి సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందన్నారు.

ఖమ్మం జిల్లా రాష్ట్ర సాధనోద్యమంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించిందన్నారు. 1969 జనవరి 8న అన్నాబత్తుల రవీంద్రనాథ్ నగరం నడిబొడ్డున 14 రోజులు నిరాహార దీక్ష చేపట్టి తొలి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోశాడని, మలిదశ ఉద్యమంలో జిల్లా క్రియాశీలకంగా వ్యవహరించిందన్నారు. కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, సకల జనులు ఈ ఉద్యమంలో ఒక్కటై ముందుకు కదిలారన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జలవనరులు, వర్షపు నీటి సంరక్షణతో నీటి లభ్యతను పెంచేందుకు మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం కింద జిల్లాలోని 4,517 చెరువులును ఐదేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో మొదటి దశలో 801 చెరువులు, రెండో దశలో 927 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టామన్నారు. మిషన్ కాకతీకయ ఫేజ్-1, 2లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 41 మండలాల్లోని 2,658 ఆవాసాలు, 7 మున్సిపాలిటీల్లోని 26.66 లక్షల ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ. 3558 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. 

ఈ ఏడాదిలో పాలేరులో 78, వైరాలో 12 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో 58,958 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 91 కోట్లతో పనులు చేపట్టామన్నారు. రూ. 7,926 కోట్లతో గోదావరి ఆధారిత సీతారామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. రాష్ట్రంలోని మన జిల్లా విద్యుత్ ఉత్పత్తిలో కేంద్ర బిందువుగా ఉందన్నారు. 

రహదారుల అభివృద్ధిలో ఖమ్మం ముందంజ..
రహదారులు జాతి నాగరికతకు చిహ్నాలని మంత్రి తుమ్మల అన్నారు. జిల్లాలో 7 మండలాలను జిల్లా కేంద్రంతో అనుసంధానం చేయడానికి రూ. 95 కోట్లను మంజూరు చేశామని, 365 కిలో మీటర్ల మేర సింగల్ ప్రధాన రహదారులను రెండు వరుస రహదారులుగా అభివృద్ధి చేసేందుకు రూ. 493 కోట్లను మంజూరు చేశామన్నారు. 1470 కిలోమీటర్ల మేర 199 పనులకు రూ. 1411 కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేయగా, 105 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. 

పంచాయతీరాజ్, గ్రామీణ రహదారుల మరమ్మతుల పథకం కింద 666 కిలో మీటర్ల మేర 193 పనులను రూ. 103 కోట్లతో చేపట్టామని, 183 పనులు పూర్తి చేశామన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం కింద 6 వేల గృహాలను కేటాయించామని, కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఖమ్మంలో అధునాతనమైన బస్టాండ్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఆసరా పథకం కింద ఇప్పటి వరకు 2.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 420 కోట్లను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 3,299 అంగన్‌వాడీ కేంద్రాలు, 1006 మినీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు సన్నబియ్యం...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోరుతూ.. ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎస్సీలకు 78 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరానికి 14,938 మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల కింద రూ. 20 కోట్లు అందించామన్నారు. బీసీలకు 65 హాస్టల్స్ నిర్వహించబడుతున్నాయని, అన్ని వర్గాల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. 

మైనార్టీలకు 5 గురుకులాలను నెలకొల్పుతున్నామని, 1200 మంది బాలబాలికలకు 5,6,7 తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 8 మంది తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు సన్మానించారు. వారిలో అర్హత గల ఆరుగురు వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 28 మందిని ప్రతిభ నగదు పురస్కార అవార్డులు అందించారు. అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. తదనంతరం మంత్రి ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను సందర్శించారు. పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించారు. 

అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడుగురు అమరవీరుల్లో ఆరుగురి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 

వీరిలో వరంగల్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన జర్పుల సురేష్ తమ్ముడు జర్పుల సంతోష్‌కు జూనియర్ అసిస్టెంట్, అదేమండలానికి చెందిన అమరవీరుడు మేన వేణు తమ్ముడు మేన నవీన్‌కు జూనియర్ అసిస్టెంట్, గార్లకు చెందిన కళా ప్రకాష్‌కుమార్‌జైన్ తమ్ముడు కుమారుడైన కళా విపుల్ కుమార్‌జైన్‌కు జూనియర్ అసిస్టెంట్, 1969 ఉద్యమకారుడు, అన్నాబత్తుల రవీంద్రనాథ్ కోడలు చిత్తజల్లు సత్యప్రియకు జూనియర్ అసిస్టెంట్, ఖమ్మం నగరానికి చెందిన షేక్ మహమూద్ పాషా కుమారుడైన షేక్ ఖాజామొహినుద్దీన్‌కు జూనియర్ అసిస్టెంట్, నగరానికి చెందిన వెంపటి రామకృష్ణ అక్క పాటి నాగమణికి అటెండర్ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారు. అమరులు కుటుంబ సభ్యులకు మంత్రి తుమ్మల శాలువా కప్పి సన్మానించి, పండ్లు అందజేశారు.

వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డుల ప్రదానం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన పలువురికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగదు పురస్కరం, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ రైతులుగా ఎర్రుపాలెం మండలం బీమవరం గ్రామానికి చెందిన వై పూర్ణచంద్రారెడ్డి, వైరా మండలం వల్లాపురం గ్రామానికి చెందిన తుమ్మల రాణాప్రతాప్‌లకు అవార్డు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఈ సత్యనారాయణ, ఇల్లెందు మండలం రొంపేడు పాఠశాలకు చెందిన ఎం రామకిషన్‌లకు, ఉత్తమ అంగన్‌వాడీ వర్కర్క్‌గా ఖమ్మం రూరల్ మండలం నాయుడపేటకు చెందిన పసుపులేటి విజయలక్ష్మికి, ఉత్తమ సోషల్ వర్కర్‌గా మానవతా సేవలు అందిస్తున్న అన్నం శ్రీనివాసరావుకు, ఉత్తమ వైద్యులుగా వాజేడు మండల పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ చేతన్, ఖమ్మం జిల్లా ప్రధాన వైద్యశాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ టీ లక్ష్మణ్‌రావుకు అవార్డులు అందజేశారు. 

ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా భద్రాచలంలోని బ్రెష్ స్కూల్ నిర్వాహకులకు, ఉత్తమ క్రీడాకారులుగా సీహెచ్ సుధాకర్, కుమారి సింధూతపస్విలకు, ఉత్తమ కవిగా ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ కందల కొదండ రామాచార్యుకి, ఉత్తమ ఆర్టిస్టులుగా సీహెచ్‌ఈ శ్రీరామ్మూర్తి, ఎంఈ లక్ష్మీనారాయణ, కే జాన్, ఏలూరి మీనాలకు, ఉత్తమ వేదపండితులుగా ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డులో గల వీరాంజనేయస్వామి దేవస్థానానికి చెందిన వడ్లమాని లక్ష్మీనారాయణకు, ఉత్తమ అర్చకులుగా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానానికి చెందిన బొర్రా వాసుదేవ చార్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఉత్తమ హఫీజ్, మౌజాన్‌గా ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ హైమతుల్లా, ఉత్తమ జర్నలిస్టుగా కొత్తగూడెం వర్తాతరంగాలకు చెందిన ఎండీ అబ్బాస్, అశ్వారావుపేట మహాన్యూస్‌కు చెందిన కే నరేందర్ కుటుంబ సభ్యులకు, ఉత్తమ మున్సిపాలిటీగా సత్తుపల్లిని ఎంపిక చేయగా, మున్సిపల్ చైర్మన్‌కు, ఉత్తమ గ్రామపంచాయతీగా ముదిగొండ మండలం పండ్రేగుపల్లి గ్రామ సర్పంచ్‌కు, ఉత్తమ శాస్త్రవేత్తగా వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన హేమంత్‌కుమార్‌కు, ఉత్తమ పారిశ్రామిక వేత్తగా వై శ్రీనివాసరావుకు, ఖమ్మం వాల్ ప్రాజెక్టుకు ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా వాల్ ప్రాజెక్టు కింద పనిచేసిన ఆర్టిస్ట్‌లకు మంత్రి ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. 

కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్‌ఖాసీం, డీఆర్‌వో శ్రీనివాస్, ఏజేసీ శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ మరళీధర్‌రావు, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్వతంత్ర సమరయోధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment