Wednesday, 1 June 2016

ఖమ్మం ది బెస్ట్..!
ఖమ్మం : మన ఖమ్మం రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా ఎంపికయ్యింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం, స్వీయ పర్యవేక్షణ, నగరపాలక సంస్థ యంత్రాంగం కృషి, పట్టుదల కారణంగా ఖమ్మాన్ని ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం ఎంపికచేసింది. తెలంగాణ ఏర్పడిన రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరు ఖమ్మంలోనే బాగున్నది. వాటి ప్రచారంలో భాగంగా చేపట్టిన నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలకు వేయించిన పెయింటింగ్స్ (వాల్ ప్రాజెక్టు) కూడా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాయి. 

అదేవిధంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫౌంటెయిన్ల ఏర్పాటు, రహదారులను హైదరాబాద్‌ను తలపించే రీతిలో తీర్చిదిద్దటం, విద్యుత్ దుబారాను అరికట్టేందుకు సెంట్రల్ లైటింగ్‌లో ఎల్‌ఈడీ బల్బులను వినియోగించటం వంటి అంశాలన్నీ అవార్డు రావటానికి దోహదపడ్డాయి. హరితహారంలో భాగంగా నగరంలోనే దాదాపు 11 కి.మీ మొక్కలు నాటడం కలిసివచ్చింది. ఆయా అంశాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్న ప్రభుత్వం ఖమ్మానికి ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును ప్రకటించింది. 

ఈ అవార్డును ఈనెల 2న హైదరాబాద్‌లో ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రధానం చేయనున్నారు. కాగా రాష్ట్రంలోనే ఖమ్మానికి నెంబర్‌వన్ స్థానం లభించటంతో నగర మేయర్ డాక్టర్ జీ పాపాలాల్, డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, కమిషనర్ జీ వేణుగోపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల సహకారంతో కేఎంసీ పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు, సిబ్భంది సమిష్టికృషితోనే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment