Wednesday, 1 June 2016

ఖమ్మం జిల్లా 41 మండలాలతో విస్తరించింది. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లుగా విభజితమై పరిపాలన కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ సంక్షేమ పథకాలు గత రెండేళ్లుగా అమలు అవుతుండగా, మరికొన్ని ఆవిష్కృతమవుతున్నాయి. పథకాల అమలు ఆలస్యమైనప్పటికీ ఆమోదయోగ్యంగా ఉండటంతో విమర్శలు తగ్గాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీర్ఘదృష్టి, భవిష్యత్తు ఆలోచనలకు కార్యరూపం పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాయి. దీనికితోడు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశంతో జిల్లాలో పలు పురోభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మొదటి ఏడాదికంటే రెండో ఏడాదిలో జిల్లా పురోభివృద్ధి పుంజుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్‌ తదితర మెజారిటీ ప్రజాప్రతినిధులు అధికార పక్షంలో ఉన్నందున జిల్లా మరింత పురోభివృద్ధి సాధించాలన్న కోరిక ప్రజానీకంలో నెలకొంది.
‘ఆసరా’కు మన్నన..
ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆసరా’ పథకానికి ప్రజానీకం మన్నన అందుతోంది. జిల్లాలో ఈ పథకంలో భాగంగా ఓఏపీ 1,12,755, వికలాంగులు 36,347, వితంతులు 1,07,377, చేనేత కార్మికులు 427, గీత కార్మికులు 2,922, బీడీ కార్మికులు 01, ఏఆర్‌టీ పెన్షన్స్‌ 3,244 పంపిణీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,63,053 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీటి విలువ నెలకు సుమారు రూ.30 కోట్లు.
వ్యవ‘సాయం’
జిల్లాలో వ్యవసాయ రంగానిదే పెద్దపీఠ. ఈ విషయాన్ని గుర్తించి పలు పథకాలతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలో నేల స్వభావం అనుసరించి సాగు చేయడం మేలైన పద్ధతి. ఆయా భూములను పరీక్షించి 44,542 భూమి ఆరోగ్య పత్రాలు రైతులకు అందించారు.అధికంగా దిగుబడినిచ్చే విత్తనాల సరఫరా, క్షేత్ర ప్రదర్శనలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు రాయితీ కోసం రూ.151 లక్షలు ఖర్చు చేశారు. జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకంలో భాగంగా రూ.11.80 లక్షల రాయితీతో అమలుపర్చారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 2015-16 సంవత్సరంలో రూ.1136.46 లక్షల రాయితీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. వర్షాధార వ్యవసాయ అభివృద్ధి పథకంలో 176 మంది రైతులకు రూ.89.87 లక్షల విలువైన లబ్ధి చేకూరింది.
రోడ్లకు రు.16 వేల కోట్లు
జిల్లావ్యాప్తంగా పలు రోడ్ల గురించి ఎవరిని అడిగినా తుమ్మల హయాంలో వేసిన రోడ్డు అని చెబుతుండటం విశేషం. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రోడ్లు భవనాల శాఖ తుమ్మల నాగేశ్వరరావుకే కేటాయించడంతో రోడ్ల అభివృద్ధి ‘వేగ’వంతమైంది.భద్రాచలం వద్ద గోదావరిపై మరో వంతెన నిర్మాణం పనులకు ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. పర్ణశాల వద్ద గోదావరిపై అధునాతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సుమారు రూ.62 కోట్లకుపైగా నిధులు వెచ్చించి ఖమ్మం నగరంలోని రోడ్లను అద్దంలా తయారు చేశారు. ప్రధాన కూడళ్లను అలంకారప్రాయంగా దర్శనమిచ్చేలా మార్చారు.
ఎంపీ లాడ్స్‌ నిధులు
ఎంపీ లాడ్స్‌లో భాగంగా రూ.2.50 కోట్లతో 369 పనులు మంజూరు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.1.37 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో 302 పనులు పూర్తయ్యాయి. 10 పనులు ప్రగతిలో ఉన్నాయి.
సి.డి.పి. నిధులు
సి.డి.పి.లో భాగంగా రూ.1.69 కోట్లతో 268 పనులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రూ.0.29 కోట్లు ఖర్చు చేసి 177 పనులు పూర్తి చేయించారు. 16 పనులు ప్రగతిలో పథంలో నడుస్తున్నాయి.
బి.ఆర్‌.జి.ఎఫ్‌. నిధులు
బి.ఆర్‌.జి.ఎఫ్‌.లో రూ.1.03 కోట్లతో 59 పనులకు మంజూరు లభించింది. ఇప్పటికీ రూ.0.63 కోట్లు వెచ్చించి 38 పనులు పూర్తి చేశారు. 8 పనులు ప్రగతిలో ఉన్నాయి.
జడ్పీ సాధారణ నిధులు
జడ్పీ జనరల్‌ ఫండ్‌ కింద రూ.0.92 కోట్లతో 119 పనులు చేపట్టగా రూ.0.41 కోట్లు ఖర్చయ్యాయి. 74 పనులు పూర్తికాగా 3 ప్రగతిపథంలో ఉన్నాయి.
జడ్పీ(ఎస్‌ఎఫ్‌సీ) నిధులు
జడ్పీ (ఎస్‌ఎఫ్‌సీ) నిధుల కింద రూ.0.35 కోట్లతో 46 పనులు చేపట్టగా రూ.0.23 కోట్ల మేర ఖర్చు చేశారు. వీటిలో 19 పనులు పూర్తయ్యాయి.

No comments:

Post a Comment