Wednesday, 1 June 2016

 -ఊరూవాడా రాష్ట్ర అవతరణ పండుగ నేడు:

హైదరాబాద్: జూన్ 2.. తెలంగాణ ప్రజలు ఏండ్లుగా ఎదురుచూస్తున్న స్వరాష్ట్రం తొలిపొద్దు పొడిచిన రోజు. దశాబ్దాల వివక్ష, ప్రాంతీయ దురభిమానం, పాలకుల పక్షపాతాలనుంచి విముక్తి పొందిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గురువారంతో రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని స్వరాష్ట్ర అవతరణ సంరంభాలను ఊరువాడా ఘనంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాల వెలుగులు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, వాడవాడలా ప్రసరించేలా ఏర్పా ట్లు పూర్తి చేసింది. 

kcr
గురువారం ఉదయం 9.30 గంటలనుంచి రాత్రి 12.30 గంటల వరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్పగా సంబురాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 14 శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను రూపొందించాయి. గురువారం ఉదయం 9.25 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులు సమర్పించడంతో తెలంగాణ రాష్ట్రమంతటా ఉత్సవాల సంబు రాలు ప్రారంభమవుతాయి. 9.40 గంటలకు అమరవీరుల స్మృతివనానికి లుంబినీపార్క్ సమీపంలో భూమిపూజ చేస్తారు. 10గంటలకు సంజీవయ్యపార్క్‌లో ఏర్పాటు చేసిన దేశంలోనే ఎత్తయిన మువ్వన్నెల జాతీయజెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. 10.40 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌లో ముక్కోటి తెలంగాణ ప్రజలకు మహత్తర సందేశాన్ని ఇవ్వనున్నారు. ఇదే వేదికనుంచి తెలంగాణ రాష్ట్రంలో అఖండకీర్తినార్జించి తెలంగాణ ప్రజలకు వివిధ రంగాల్లో విశేష సేవలనందించిన 62 మందిని సముచిత రీతిలో సత్కరించనున్నారు. 

అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ నరసింహన్‌తోకలిసి సీఎం కేసీఆర్ హెచ్‌ఐసీసీలో 2500 మంది ప్రతినిధులతో ఇష్ఠాగోష్ఠి జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, సామాజిక నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ప్రతి జిల్లా నుంచి 50మంది చొప్పున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. సుమారు 100మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 150మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, 100మంది అధికారులు, మైనార్టీ వర్గాలకు చెందిన పెద్దలు 100 మంది, 400మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, 150మంది అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉన్నత విద్యాశాఖకు చెందిన ప్రిన్సిపాళ్లు 250 మంది, సాంకేతిక విద్యాశాఖకు చెందిన 250మందిని ఉత్సవాలకు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. 

ఐటీ, పరిశ్రమలు, క్రీడా రంగం సినిమా పరిశ్రమ, సాంస్కృతిక రంగాలకు చెందిన దాదాపు 500మంది ఉత్సవాలకు హాజరుకానున్నారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడువేల మంది హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కలిపి 25 వేదికల్లో మహోన్నతంగా తెలంగాణ సాంస్కృతిక వైభవవైజయంతిక రెపరెపలాడేలా విశిష్ట కార్యక్రమాలు జరుగనున్నాయి. కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఖవ్వాలీ గానాలు, జానపద ఆటపాటలు, జానపద, శాస్త్రీయ నృత్యాలు, అసాధారణమైనరీతిలో ఏర్పాటు చేస్తున్న పటాకుల మెరుపులు, గిరిజన కళాకారుల కార్నివాల్ వంటివి జాతీయస్థాయి కార్యక్రమాలుగా రికార్డు కానున్నాయి. ఇదే సందర్భంలో ఉదయం 11 గంటలనుంచి రాత్రి 12.30 వరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాప్రదర్శనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

No comments:

Post a Comment